ఏడాదికి 365 రోజులు.. ఏ రోజు.. ఏ పని చేయాలో మనలో చాలా మంది క్యాలెండర్‌లో టిక్ చేసుకుని పెట్టుకుంటారు... అదే లీప్ ఇయర్ అయితే.. ఏడాదిలో ఒక్కరోజు అదనంగా వచ్చి చేరుతుంది... 365 రోజుల క్యాలెండర్ కాస్తా 366 తేదీలతో కళకళలాడుతుంది.. ఈ ఏడాది ఆ ప్రత్యేకమైన రోజు శనివారం రావడంతో స్పెషల్ డే కాస్తా చాలామందికి హాలిడే అయిపోయింది. అయితేనేం నాలుగేళ్లకొకసారి వచ్చే లీప్ ఇయర్‌ను ఎంజాయ్ చేసేందుకు అంతా సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఈ అరుదైన రోజున పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనే వారి ఆనందం రెట్టింపైంది. అంతేకాదు సర్చ్ ఇంజన్ గూగుల్.. ఈసారి ‘జంపింగ్ డూడుల్’తో లీప్ ఇయర్‌ను సెలబ్రేట్ చేస్తోంది. ఈ సందర్భంగా... అసలు లీప్ ఇయర్ అంటే ఏంటి.. ఇది ఎప్పుడు మొదలైంది.. ఈ ఎక్స్‌ట్రా డే వెనుక ఉన్న వివరాలు కొన్నింటిని తెలుసుకుందాం.
మానవాళి మనుగడ సాగించే భూ గ్రహం.. సూర్యుడి చుట్టూ పరిభ్రమించడానికి దాదాపు 365.2422 రోజుల సమయం పడుతుందన్న విషయం తెలిసిందే. ఇందులో 365 రోజుల కాలాన్ని సాధారణంగా ఒక సంవత్సరంగా పేర్కొంటారు. అయితే, 365 మీద ఉన్న 0.2422 రోజును 0.25 రోజుగా పరిగణిస్తే, ఇలా ఏడాదికి దాదాపు ఆరు గంటలు మిగులుతుంది. ఇదంతా కలిసి, నాలుగేళ్లకు 24 గంటలు అంటే ఒక రోజు అవుతుంది. అలా మిగిలిన రోజును నాలుగేళ్లకు ఒకసారి క్యాలెండర్‌లో చేర్చుతారు. ఇలా అదనపు రోజు వచ్చిన ఏడాదిని లీపు సంవత్సరంగా పిలుస్తారు. అందుకే, సాధారణ సంవత్సరాల్లో ఫిబ్రవరి నెలలో 28 రోజులు మాత్రమే ఉండగా.. లీపు సంవత్సరంలో 29 రోజులుంటాయి.